Tuesday 21 April 2015

ప్రత్యేక హోదా ఇవ్వకపోవచ్చు

ప్రత్యేక హోదా ఇవ్వకపోవచ్చు


  •  ఆ స్థాయి ప్యాకేజీ సాధనకు సిద్ధం కావాలి
  •  కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలి
  •  ఒకటికి రెండుసార్లు అడగాలి
  •  చైనా స్థాయిలో నవ్యాంధ్రను అభివృద్ధి చేయాలి
  •  పార్టీ ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబు
  •  పుష్కరాలకు ప్రధానిని ఆహ్వానించాలని నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కనిపించట్లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ప్రత్యేక హోదా స్థాయి ప్యాకేజీని సాధించుకునేందుకు సిద్ధం కావాలని తెలుగుదేశం ఎంపీలకు ఆయన సూచించారు. ఏపీ భవన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్‌ గజపతిరాజు సహా పార్టీ ఎంపీలంతా ఈ భేటీకి హాజరయ్యారు. బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఇందులో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒకపక్క ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇవ్వకపోవచ్చుననే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు గ్రాంటుల రూపంలో వస్తాయని, ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా అదే స్థాయిలో.. లేదంటే 70 శాతానికి తగ్గకుండా నిధులు సాధించేందుకు సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు, పనులకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ఆయా శాఖల కేంద్ర మంత్రుల్ని కలవాలని తెలిపారు. ఒకటికి రెండుసార్లు కేంద్ర మంత్రుల్ని కలవటంలో తప్పు లేదని, వాస్తవానికి అలా కలిసి వివరించబట్టే గత నెలలో రాషా్ట్రనికి రావాల్సిన నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. ఆర్థిక సంవత్సరం చివర్లో రాషా్ట్రనికి రావాల్సిన నిధుల్ని విడుదల చేయించుకోవటంలో ఎంపీల చొరవను ప్రశంసించారు. విభజన సందర్భంగా ఇచ్చిన పలు హామీలను ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సి ఉందని.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బూర్గంపాడు గ్రామ అంశాన్ని పరిష్కరించుకోవాలని తెలిపారు. రాజధానికి నిధులు రాబట్టుకోవాలని, 13వ ఆర్థిక సంఘం బకాయిలు రూ.690 కోట్లు విడుదల కావాల్సి ఉందని గుర్తు చేశారు.
కేంద్రానికి మద్దతివ్వాల్సిందే!
పార్లమెంటులోనూ బయటా ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలబడాలని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. భూసేకరణ బిల్లు విషయంలో కూడా అన్ని విధాలా సహకరించాలని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, జరపాల్సిన చర్చలు మొదలైన అంశాలపైనా పలు సూచనలు చేశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం ఎన్‌కౌంటర్‌ గురించి తమిళనాడు ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తే తక్షణం స్పందించి వాస్తవాలను తెలియజేయాలన్నారు.
నీళ్లు వాడుకోనిస్తే కరెంటిద్దాం
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆ నీటిని రాయలసీమ అవసరాలకు వాడుకునేందుకు తెలంగాణ అంగీకరిస్తే ఆ రాషా్ట్రనికి అవసరమైన విద్యుత్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. తన చైనా పర్యటన విశేషాలను కూడా చంద్రబాబు ఎంపీలకు తెలిపారు. చైనాలో జరిగిన అభివృద్ధి చాలా బాగుందని కొనియాడారు. అదే స్థాయిలో నవ్యాంధ్రని అభివృద్ధి చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఎంపీలంతా తమతమ నియోజకవర్గాలు, జిల్లాలను అభివృద్ధి చేసుకునేందుకు విభిన్నమైన ప్రణాళికలు రచించాలని చంద్రబాబు సూచించారు. ఎంపీ ల్యాడ్స్‌ నుంచి కొంతమేర నిధులు ఇస్తే వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని నిధుల్ని మ్యాచింగ్‌ గ్రాంటుగా జతచేసి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చునని తెలిపారు. టాటా ఫౌండేషన్‌ సహకారంతో దాదాపు 400 గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌ కింద మౌలిక సదుపాయాల కల్పనకు విజయవాడ ఎంపీ కేశినేని నాని చూపిన చొరవను ప్రశంసిస్తూ.. మిగతా ఎంపీలు కూడా ఇదే రీతిలో విభిన్నంగా ఆలోచించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు.
ఢిల్లీ, ఏప్రిల్ 22:  ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకూ తామేమీ మాట్లాడబోమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. టీడీపీపీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ డిమాండ్‌ మాత్రం ప్రత్యేక హోదాయేనని, దాని కోసమే తాము ఇప్పటికీ కేంద్రాన్ని కోరుతున్నామని స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదాను వదిలేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనిది మాత్రం భిన్నమైన పరిస్థితి అని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్య అనంతపురం పర్యటనకు వచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో మరొకమారు ఈ అంశంపై మాట్లాడామని చెప్పారు.

No comments:

Post a Comment