Tuesday 21 April 2015

మరో సింగపూర్‌ సాధ్యమా?

మరో సింగపూర్‌ సాధ్యమా?
  •  కష్టపడితే సాధ్యమేనంటున్న సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలు
  •  ఏపీకి భూమి, వనరుల లభ్యత అనుకూలమని వెల్లడి
(సింగపూర్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘సీమాంధ్రను మరో సింగపూర్‌ చేస్తాం’.. ఎన్నికల ముందు, ఎన్నికల ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతోసహా టీడీపీ నేతలు తరచూ చెబుతున్న మాట ఇది. అభివృద్ధిపరంగా, పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించడంలో అనేక వందల రెట్లు ముందున్న సింగపూర్‌ను అందుకోవడం ఏపీకి సాధ్యమేనా? చిత్తశుద్ధితో శ్రమిస్తే సాధ్యమేనంటున్నారు అక్కడి ప్రభుత్వ పెద్దలు.. అధికారులు. సింగపూర్‌ కన్నా వనరుల పరంగా ఏపీ ఎంతో ముందు ఉందని, వ్యవసాయం.. ఉత్పత్తి పరిశ్రమలు.. భూమి.. మానవవనరులు.. ఇవన్నీ ఏపీని సింగపూర్‌ కన్నా మెరుగైనస్థానంలో ఉంచేందుకు దోహదపడే అంశాలని వారు విశ్లేషిస్తున్నారు.
 
పర్యాటకమే ప్రధానం
పర్యాటకంపైసింగపూర్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉన్న నదిని వీలైనంత శుభ్రం చేసి దానికి ఇరు పక్కలా పర్యాటక ఆకర్షణ కేంద్రాలను నిర్మించారు. అమెరికాకు చెందిన ఒక కంపెనీ రూ.40 వేల కోట్ల వ్యయంతో 88 అంతస్థులతో ఓ భవనాన్ని నిర్మించి అందులో కాసినోను ఏర్పాటు చేసింది. పర్యాటకుల కోసం ఒక ఈత కొలను, హోటళ్లు పెట్టింది. ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడులు మూడేళ్లలో తిరిగి వచ్చేశాయని మీడియా బృందానికి సహాయకుడిగా వచ్చిన సింగపూర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. సింగపూర్‌లో హోటళ్లు నిత్యం కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇక్కడ హోటళ్లకున్న డిమాండ్‌ను పట్టి సింగపూర్‌లో మూడో హోటల్‌ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. అభివృద్ధికి తలమానికంగా ఉన్న సింగపూర్‌కు భూ లభ్యతే పెద్ద సమస్యగా మారింది. చుట్టూ నీరు ఉన్న ద్వీపం కావడంతో వేరే దారి లేక సముద్రాన్ని పూడ్చి వాడకానికి అనువుగా మార్చుకొంటున్నారు. భూ లభ్యత సమస్య నివారణకు బహుళ అంతస్థుల నిర్మాణాలను విరివిగా చేపట్టారు.
 
ఆంధ్రప్రదేశ్‌ కూడా అందుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా సింగపూర్‌ మాదిరిగా అభివృద్ధిని అందుకోవచ్చునని, కావాల్సిందల్లా సరైన ప్రణాళిక మాత్రమేనని ఆ దేశ వాణిజ్య పరిశ్రమల మంత్రి షణ్ముగం అభిప్రాయపడ్డారు. ఏపీలో వనరుల లభ్యత అధికంగా ఉందన్నారు. ‘‘మాతో పోలిస్తే మీకు భూ లభ్యత చాలా ఎక్కువ. మేధో సంపత్తి కలిగిన మానవ వనరులూ ఉన్నాయి. ఐటీ పరిశ్రమ మీ వద్ద బాగా అభివృద్ధి చెంది ఉంది. పెద్ద పరిశ్రమలు రావడానికి...పెట్టడానికి మీకు వసతులు ఉన్నాయి. ఇన్ని వనరులుంటే అద్భుతాలు చేయవచ్చు. అంతేకాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారాలను...వ్యాపార సంస్ధలను ఆకర్షించగలగాలి. వారిలో విశ్వాసం కలిగించాలి. ఆ పని చేస్తే సింగపూర్‌కు కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్‌ నిలబడగలుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌కు లభించిన మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంఽధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ఇస్తున్న అధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘తూర్పు ఆసియా దేశాల సముద్ర వాణిజ్యానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ ద్వారంగా మారడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏ దారిలో వెళ్తే ఇతర దేశాలను ఆకర్షించగలమో అదే పనిని బాగా చేస్తోంది. దీనివల్ల అందరి దృష్టి ప్రస్తుతం అటువైపు పడుతోంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తాము మొత్తం పదహారు విడివిడి ప్రణాళికలు తయారు చేస్తున్నామని మరో అధికారి తెలిపారు. కాని ఈ ప్రణాళికల అమలుకు నిధుల సమీకరణే పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది. దీనికి విదేశాల్లోని సంస్థల నుంచి నిధుల సమీకరణే మార్గమని సింగపూర్‌లోని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు విదేశాల్లో మంచి ట్రాక్‌ రికార్డు ఉందని, అందువల్ల ఫలితం ఉండవచ్చని అనుకొంటున్నామని ఒక అధికారి వ్యాఖ్యానించారు. 
 
ఇలా ఎదిగారు..
ఒకప్పుడు సింగపూర్‌ ఎంతో అధ్వానంగా ఉండేది. అక్కడి పాలకుల చిత్తశుద్ధితో క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతూ వచ్చాయి. వనరులపరంగా ఇప్పటికీ సింగపూర్‌ బాగా వెనకబడి ఉంది. ఆ దేశంలో వ్యవసాయం లేదు. ఉత్పత్తి పరిశ్రమలు లేవు. భూమి లేదు. మానవ వనరులూ అంతంతే. ఒకానొక సమయంలో మంచినీటిని కూడా పొరుగున ఉన్న మలేషియా నుంచి దిగుమతి చేసుకొనేవారు. కానీ ఇవేవీ సింగపూర్‌ అభివృద్ధికి అవరోధాలుగా నిలవలేదు. వారు ప్రతి వాన చుక్కను ఒడిసి పట్టుకోవడం నేర్చుకున్నారు. వాడిన నీటిని తిరిగి వాడుకోవడానికి అవసరమైన సాంకేతికతను సంపాదించారు. ‘న్యూ వాటర్‌’ పేరుతో పునర్వియోగ నీటిని తాగు నీటిగా మార్చి వాడుతున్నారు. అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించడంలోనూ సింగపూర్‌ కొత్త పుంతలు తొక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలను సింగపూర్‌కు ఆకర్షించడం ద్వారా నిధుల కొరతను ఆ దేశం అధిగమించగలిగింది. ‘పచ్చదనం, పరిశుభ్రత ఉన్న ప్రపంచస్థాయి నగరంగా సింగపూర్‌ను తీర్చిదిద్దడం ఒక్క రోజులో సాధ్యం కాలేదు. మురికివాడలు లేకుండా చేయడానికి ప్రభుత్వపరంగా గృహ నిర్మాణం చేపట్టి పౌరులకు నివాస వసతి కల్పించాం. నిరుద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి ఉపాధికల్పనకు బాటలు వేశాం. భవిష్యత్తులో ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నిర్ణయించుకొని ఒక మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసుకొన్నాం. కళ్ల ముందు అభివృద్ధి కనిపిస్తుండంతో పౌరులు సహకరించడం మొదలు పెట్టారు’ అని నగర ప్రణాళికా విభాగం అధికారి వివరించారు. 

No comments:

Post a Comment