Friday 27 March 2015

‘రాజధాని’లో బస ఇక్కట్లు

‘రాజధాని’లో బస ఇక్కట్లు

మంగళగిరి (మార్చి 27): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలు మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. ఇదే సమయంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోవడంతో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల నుంచి రియల్టర్లు వచ్చి అమ్మకాలు, కొనుగోళ్లు చేయడంతో రద్దీ బాగా పెరిగింది. లక్షలాది, కోట్లాది రూపాయలు చేతులు మారు తున్నప్పటికీ ఎవరైనా వచ్చి ఒక్క రాత్రి ఇక్కడ ఉండడానికి సరైన వసతులు లేకపోవడంతో అనేక మంది ఎంత రాత్రయినా విజయవాడ, గుంటూరు నగరాలలో వసతి కోసం లాడ్జిలు, త్రీస్టార్‌ హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. మంగళగిరిలో ఇప్పటివరకు కేవలం ఐదు చిన్న లాడ్జీలు, కేవలం పది మందికి మాత్రమే వసతి కల్పించే హోటళ్లు ఉన్నాయి. ఆరు నెలల నుంచి తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాలలో రియల్టర్లే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యాత్రీకులు, సందర్శకులు, పలువురు తమ ఆస్తులను పరిరక్షించుకోవడానికి వస్తున్నా రు. ఇక్కడ రెండు రోజులు గడపడానికి హోటళ్లు లేకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. విజయవాడలో సకల వసతులతో హోటళ్లు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది రాత్రి సమయాల్లో అక్కడ ఉండి ఉదయం మంగళగిరి పరిసర ప్రాంతాలకు వచ్చి తమ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు మంగళగిరి మీద దృష్టి పెట్టని కొంతమంది త్రీస్టార్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ యజమానులు ఇక్కడ భారీ నిర్మాణాలతో హోటళ్లు కట్టడానికి ముం దుకొస్తున్నారు. తాజాగా మంగళగిరి బైపాస్‌ రోడ్డు సమీపంలో భారీగా ఫైవ్‌స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన ఒక బడా కాంట్రాక్టరు ముందుకొచ్చారు. ఇదే సమయంలో గుంటూరు- విజయ వాడ మధ్య ఒకటి, రెండు హోట ళ్లు, రిసార్ట్స్‌ ఉన్నప్పటికీ ఇప్ప టివరకు ఆశించిన స్థాయిలో కస్టమర్లు బస చేయ కపోవడంతో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
రాజధాని ప్రకటనతో ఊపు..
రాజధాని పేరు వెలుగులోకి వచ్చిన తరువాత వారిలో తిరిగి ఉత్సాహం పెరిగి రాయలసీమ, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొంత మంది కాంట్రాక్టర్లు వాటిని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో రానున్న కాలంలో మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాలలో వసతి సౌకర్యం మెరుగు పడుతుందని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎయిమ్స్‌, రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్న అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక రాజధానిపై కూడా కనీసం ఐదు వేల మందికి వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అవసరమైన వసతి ఏర్పాటు చే యాల్సిన అవసరం ఉంది. మంగళగిరి ప్రాం తంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో, పీపీపీ విధా నంలో కాటేజీల నిర్మిస్తే కొంతవరకైనా వస తు లు కల్పించవచ్చని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.
 
అభివృద్ధి పనులపైనే హోటల్స్‌ భవిష్యత్‌...
గుంటూరు-విజయవాడ మధ్య ఇప్పటివరకు ఉన్న హోటళ్లు, రిసార్ట్స్‌ ఆక్యుపెన్సీ రేటు చాలా తక్కువగా ఉందని హ్యాపీ క్లబ్‌ రిసార్ట్స్‌ అధినేత అంబటి మధు మోహనకృష్ణ తెలిపారు. రాజధాని ప్రకటన తరువాత గుంటూరు కంటే విజయవాడ హోటళ్ల బస చేసే రేటు బాగా పెరిగిందని తెలిపారు. మంగళగిరి, పరిసర ప్రాంతాలలో ప్రభుత్వం ప్రకటించిన రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో టూరిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ భవిష్యత్తు బాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు ఫైవ్‌స్టార్‌, త్రీస్టార్‌ హోటల్‌ నిర్మాణానికి విజయవాడ, ఎయిర్‌పోర్టు దగ్గర్లో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు వేగవంతం చేసినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఇక్కడ వసతి కల్పించడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment