Friday 27 March 2015

నర్తకి మల్లిక పేరిట ఏర్పడిన మల్కాపురం

రాజధాని గ్రామాలు: నర్తకి మల్లిక పేరిట ఏర్పడిన మల్కాపురం

- గణపతిదేవుడు, రుద్రమదేవి పాలించిన నేల
- శివాలయం సమీపంలో శిలాశాసనం 
- రాయల ఆస్థాన నర్తకి మల్లిక పేరు మీదుగా..
- ఘన చారిత్రక నేపథ్యం మల్కాపురం సొంతం
 
తుళ్లూరు: వ్యవసాయ పనులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలోనే గడిపే మల్కాపురం వాసులకు గొప్ప చరిత్ర ఉంది. మల్కాపురం చిన్నపాటి ఊరే అయినా చారిత్రాత్మక ప్రదేశం అని కొంతమందికే తెలుసు. క్రీస్తు శకం 1000 నుంచి 1323 మధ్య కాలంలో కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించే వారు. వారిలో ముఖ్యుడైన గణపతిదేవుడు క్రీస్తు శకం 1199 నుంచి 1262 కాలంలో, 1262 నుంచి 1289 మధ్యకాలంలో ఆయన కుమార్తె రుద్రమదేవి పరిపాలించారు. రుద్రమదేవి తొలి మహిళా రాజ్యాధినేతగా ఖ్యాతికెక్కారు. కాకతీయుల కాలంలో చెక్కిన శిలాశాసనం మల్కాపురంలో ఉంది.
 
అమరావతి శివలింగం ఇక్కడిదే..
మల్కాపురంలోని శాసనానికి 150 అడుగుల దూరంలో శిథిలావస్థలో ఉన్న గుడి ఉంది. అమరావతి శివలింగం ఈ గుడిలో ఉండేదని దొంగలు చోరీ చేసి పారిపోతుండగా కృష్ణా తీరం వెంట నందులు వారిని వెంబడించగా అమరావతి వద్ద వదలి పారిపోయారని చరిత్ర చెబుతోంది. ఆ శివలింగానికి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయం కట్టించారని ప్రతీతి. అందుకే మల్కాపురం శిలాశాసనంపై ఉన్న నంది అమరావతి వైపు ఉన్న శివుడిని చూస్తున్నట్లు ఉంటుంది. కృష్ణా తీరం వద్ద నేటికీ నందులు దర్శనమిస్తూంటాయి.
 
చరిత్రకు సాక్ష్యం..
మల్కాపురం శిలాశాసనానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈ శాసనంలో కాకతీయుల రాజవంశవర్ణం , గోళకీమఠ సాంప్రదాయం మొదలైన విషయాల ప్రస్తావన ఉంది. శాసనం తొలి నాలుగు శ్లోకాల్లో ఇష్టదేవత ప్రార్థన, ఐదో శ్లోకం నుండి 21 శ్లోకం వరకు కాకతీయ రాజవంశం ప్రస్తావన, 38 శ్లోకం దాన శాసన కాలాన్ని, 39, 40 శ్లోకాలు దాన స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. శాసనం రెండు వైపులా సంస్కృత భాషలో చెక్కిన రెండు వందల పంక్తులు ఉన్నాయి. ఒక వైపు పరిశీలించగా కాకతీయుల రాజుల పరిపాలన గురించి, రెండో వైపు గణపతిదేవుడి గురువు విశ్వేశ్వరశంభునకు మందడం, వెలగపూడి, మల్కాపురం దానం చేశారని ఉంది.
 
నర్తకి మల్లిక పేరు మీదుగా..
శ్రీకృష్ణదేవరాయుల కొలువలో నర్తకి మల్లికకు రెండు గ్రామాలు కలిపి కొంత భూమిని దానమిచ్చినందున మల్కాపురంగా మారిందని ఒక ప్రచారం ఉంది. ఇది కొంత కాలం అగ్రహార గ్రామంగా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంది. మం దడం, వెలగపూడి గ్రామాలు కాలాంతరంలో మందడం, మల్కాపురం, వెలగపూడిగా మారాయి. మల్కాపురం జనాభా దాదాపు 1400. ఓటర్ల సంఖ్య 1015 . వ్యవసాయమే గ్రామస్తుల జీవనోపాధి. రాజధాని ప్రకటించటంతో గ్రామ రూపు రేఖలు మారనున్నాయి.

No comments:

Post a Comment