మహాదేవ భిక్షు ఆధ్వర్యంలో నిర్మాణం... మెకంజీ తవ్వకాలతో వెలుగులోకి!
‘మాకు కావాలి!కాదు.. భగవానుని అస్థికలు మాకే చెందుతాయి’
..ఎనిమిది పదుల వయసులో మహాభినిష్క్రమణం చెందిన తథాగతుని దగ్ధావశేషాల కోసం మల్ల రాజ్య రాజధాని కుసినార సమీపంలోని మకుట చందనం వద్ద గొడవ జరుగుతోంది. బుద్ధుడి అస్థికలు తమకు కావాలంటే తమకు కావాలని వైశాలి, మగథ, కపిలవస్తు తదితర రాజ్యాల ప్రభువులు కోరుతున్నారు. ఎవరి భావోద్వేగం వారిది!! కానీ.. బుద్ధ భగవానుని శరీరావశేషాలు ఎవరికి చెందాలి?
ఈ సమస్యను పరిష్కరించడానికి ద్రోణుడనే బ్రాహ్మణుడు ముందుకొచ్చాడు. అక్కడ ఉన్న దగ్ధావశేషాలను ఎనిమిది భాగాలుగా విభజించి పంచాడు. ఆయా రాజులు వాటిని తమతమ రాజ్యాలకు తీసుకువెళ్లి, వాటిని పవిత్ర ప్రదేశాల్లో భద్రపరిచి వాటిపై స్తూపాలను నిర్మించారు. ఆ ఎనిమిది స్తూపాలకూ ధాతు(గర్భ) చైత్యాలని పేరు. అనంతరకాలంలో ఆ ధాతువులను అశోకుడు సేకరించి మరిన్ని చిన్న శకలాలుగా విభజించి దేశవ్యాప్తంగా 84,000 ధాతుగర్భ స్తూపాలను నిర్మింపజేసినట్టు, బౌద్ధ ధర్మాన్ని దేశవ్యాప్తం చేసేందుకు.. ఎనిమిది మంది భిక్షువులను పంపినట్టు చరిత్ర చెబుతోంది. ఆ ఎనిమిది మందిలో మహిష మండలానికి వచ్చినవాడు.. మహా దేవ భిక్షువు. మహిష మండలం అంటే.. నేటి మైసూరు, ఆంధ్ర రాజ్యాలు ఉన్న ప్రాంతం. మగథ మహాసాంఘిక నాయకుడైన మహాదేవ భిక్షువు కృష్ణాతీరంలో.. ధాన్యకటకాన్ని తన కర్మభూమిగా చేసుకొని బౌద్ధాన్ని విస్తరింపజేశాడు.
మహాదేవుడి ఆధ్వర్యంలో..
క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో బుద్ధుని ధాతువులను ఉంచిన పేటికను తీసుకుని దక్షిణాపథానికి బయలుదేరిన మహాదేవ భిక్షువు.. ధాన్యకటకం సమీపంలో సిద్ధార్థుని ధాతువులతో పాటు బంగారు పూలు, ముత్యాలను ఐదు స్పటిక భరిణల్లో ఉంచి చైత్యం నిర్మింపజేశాడు. అదే నేటి మహాచైత్యం. ఇప్పుడు అమరావతి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే చారిత్రక బౌద్ధ స్తూపం వెనుక ఇంత కథ ఉంది. ఈ మహాచైత్యం వర్తులంగా విస్తరించి నాలుగు దిశల్లోనూ దీర్ఘచతురస్రాకార వేదికలపై ఐదేసి రాతి స్తంభాలు కలిగి ఉంటుంది. బుద్ధుని జీవితంలోని ప్రధాన ఘట్టాలు.. ఆయన జననం, మహాభినిష్క్రమణం, జ్ఞానోదయ ఘట్టం, ధర్మచక్ర ప్రవర్తన, మహాపరినిర్వాణాలకు ప్రతీకగా ఐదు స్తంభాలను ఏర్పాటు చేశారు. చైత్యం చుట్టూ వలయాకారంలో ప్రాకారం, నాలుగు దిశల సింహద్వారాలను ఏర్పాటు చేశారు. చైత్యం 54 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల ఎత్తు ఉంటుంది. చైత్యం పైభాగంలో చలువ రాతి శిల్ప ఫలకాలు, పూర్ణకుంభాలు, త్రిరత్న లాంఛనాల వరుసతో పాటు మూలాలంకార పట్టికలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. వీటితో పాటు పద్మాలంకారాలతో బుద్ధుడి జీవిత ఘట్టాలను శిల్పాలుగా చెక్కారు. చైత్యంపై ఏర్పాటు చేసిన శిల్పకళ ఖండాతర ఖ్యాతి పొందింది. 14వ శతాబ్దంలో సింహళ బౌద్ధ భిక్షువు ధర్మకీర్తి అమరావతిలోని మహాచైత్యాన్ని సందర్శించినట్లు సింహళ శాసనాల ద్వారా తెలుస్తోంది. కానీ.. 16వ శతాబ్దం తరువాత చైత్యం ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరింది. 1797లో.. ఆ ప్రాంతంలోని ప్రజలు ఈ దిబ్బను తవ్వి.. తమ ఇళ్లనిర్మాణాలకు అవసరమైన ఇటుకలు, పాలరాతిని, ఇతర వస్తువులను తీసుకెళ్లడం శ్వేతజాతీయుడైన కల్నల్ మెకంజీ గమనించి.. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపించి స్తూపాన్ని గుర్తించారు. 1845 నుంచి 1973-74 దాకా వివిధ దశల్లో పలువురు ఆంగ్లేయ, భారతీయ అధికారులు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపి అమూల్య శిల్ప సంపదను చరిత్ర గర్భం నుంచి వెలికి తీశారు. కానీ.. బ్రిటిషరుల తమ హయాంలో బయల్పడ్డ వాటిని తొలుత మచిలీపట్నానికి, ఆ తర్వాత మద్రాసు మ్యూజియానికి, అక్కణ్నుంచీ లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియానికి తరలించారు. భారతీయ చరిత్రకారులు సుబ్రమణ్యం, కృష్ణమూర్తి, కార్తికేయశర్మ 1958 నుంచి 1975 వరకు చేపట్టిన తవ ్వకాలలో లభించిన శిల్పాలను మాత్రం స్థానిక పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు. కేంద్రపురావస్తుశాఖ.. మహాచైత్యం నమూనాను తయారు చేయించి మ్యూజియంలో ఉంచింది.
-అమరావతి
No comments:
Post a Comment