Thursday, 26 March 2015

అమరావతి... అజరామరకీర్తి అమరావతి కథలు - 1

అమరావతి... అజరామరకీర్తి (25-Mar-2015)
వాణిజ్య కేంద్రంగా, బౌద్ధారామంగా క్రీస్తు పూర్వం నుంచే ఖ్యాతి
వారసత్వ నగరం.. చరిత్రను కాపాడితే వైభవం
మత, సాంస్క ృతిక, వాణిజ్య కేంద్రం

బౌద్ధ మత కేంద్రంగా, శాతవాహనుల రాజధానిగా, అంతర్జాతీయ వాణిజ్యకేంద్రంగా ధాన్యకటకానికి అద్భుత చరిత్ర ఉంది. ధాన్యకటకం అంటే ధాన్యం ఉంచే చోటు అని అర్థం. పూర్వం రాజులు చుట్టుపక్కల గ్రామాల రైతుల నుంచి పన్నుగా ధాన్యం వసూలు చేసేవారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. క్రీ.శ.4వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకూ ధరణికోట ఆంధ్రదేశ రాజకీయాల్లో కీలకస్థానం వహించింది. ఈస్టిండియా హయాంలో వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు చింతపల్లిని విడిచి ధరణికోట సమీపంలో అమరావతి పేరుతో కొత్తనగరాన్ని నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ధరణికోట మరుగున పడి అమరావతి పేరు వాడుకలోకి వచ్చింది.
- పి.వి.పరబ్రహ్మశాసి్త్ర, శాసన అధ్యయనకారులు, చరిత్రపరిశోధకులు
అనగనగా అమరావతి! శాతవాహన సామ్రాజ్య లక్ష్మికి రాజధాని! గౌతమ బుద్ధుడు నడయాడిన గడ్డ. దక్షిణాపథాన బౌద్ధం పరిపూర్ణస్థాయిలో విరాజిల్లిన తావు. చైత్యాలు, విహారాలకు నెలవు. ఇక్ష్వాకు, పల్లవ, శాలంకాయన, కోట వంశీయ, రెడ్డిరాజుల పాలనా కేంద్రం.. వేల సంవత్సరాల అద్భుత చరిత్రకు, మహోన్నత సంస్కృతికి పట్టుగొమ్మ.. ధాన్యకటకంగా, ధరణికోటగా విరాజిల్లిన అమరావతీ పట్టణం! చారిత్రక నగరాలుగా యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఇరాన్‌, ఇరాక్‌, గ్రీస్‌ తదితర దేశాల చరిత్రకు తీసిపోని ఘనచరిత ఉన్న పట్టణం అమరావతి. దక్షిణ భారతదేశంలో తొలి మహాసామ్రాజ్యం శాతవాహనులది. అశోకుడి కాలానికి ముందు నాగ, యక్ష, సదా రాజవంశాలు ధాన్యకటకం రాజధానిగా పాలన చేశాయి. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, కోట వంశీయులు, రెడ్డిరాజులు ధాన్యకటకం రాజధానిగా సుస్థిర పాలన అందించారు. అశోకుడికి ముందు నుంచే బౌద్ధం ఇక్కడ విరాజిల్లిందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమబుద్ధుడు స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటించి బోధలు చేశారనేందుకుచారిత్రక ఆధారాలు ఉన్నాయని భారతపురావస్తు శాఖ మాజీడైరెక్టర్‌ ఐ.కె.శర్మ వెల్లడించారు. వేల సంవత్సరాల అద్భుత చరిత్రకు, మహోన్నత సంస్కృతికి, బౌద్ధమత వ్యాప్తికి అమరావతి కేంద్రబిందువుగా నిలిచింది. చైనాయాత్రికుడు, బౌద్ధ భిక్షువు హుయాన్‌సాంగ్‌ క్రీస్తు శకం 640లో అమరావతిని సందర్శించి, ఆ పట్టణ కీర్తిని వేనోళ ్ల కీర్తించారు.
మట్టిపొరల్లో మహానగరాలు
క్రీ.పూ. మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి అమరావతిలో వేయించిన శాసనాలు మన చరిత్రకు ఆధారాలు. అంతకు ముందు నుంచే ధాన్యకటక ప్రాంతం ప్రధాన వాణిజ్యకేంద్రంగా వెలుగొందిందని అక్కడ తవ్వకాల్లో లభించిన రోమన్‌ నాణాలు, ఇతర పురావస్తువుల ఆధారంగా చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. ఇక్కడ కృష్ణానది పశ్చిమవాహినిగా మలుపుతిరుగుతుంది. తెలుగునేల అంతటా బౌద్ధారామాలు వెలుగుచూసినప్పటికీ రాష్ట్రంలో బౌద్ధమత వ్యాప్తికి అమరావతి కేంద్రబిందువుగా నిలిచిందనేందుకు అనేక శాసన అధారాలు లభించాయి. ఇక.. అమరావతిలో బ్రిటిషర్ల కాలంలో.. 1797, 1854 సంవత్సరాల్లో పురావస్తు పరిశోధనలు జరిగాయి. అప్పుడు లభించిన అపురూపమైన శిల్పసంపదను మచిలీ పట్నానికి అక్కడి నుంచి మద్రాసుకు తరలించారు. 1859లో వాటిలో కొన్నిటిని లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియానికి పంపేశారు. ఇప్పటికీ ఆ విగ్రహాలు లండన్‌ మ్యూజియంలో ‘అమరావతి గ్యాలరీ’ పేరిట కనువిందు చేస్తున్నాయి. పాత చరిత్రకు సంబంధించిన కొత్త కథలు చెబుతున్నాయి. అలా తరలిపోయినవి పోగా.. ప్రస్తుతం అమరావతి మ్యూజియంలో ఉన్న సంపద నామమాత్రం అని చరిత్రకారుల భావన. అలా వేరే దేశాలకు, రాష్ట్రాలకూ తరలిపోయిన అమరావతి శిల్ప సంపదను రాష్ట్రప్రభుత్వం వెనక్కు రప్పించేందుకు కృషి చేయాలని.. కుదరకపోతే, ఆయా శిల్పాల నమూనాలను తెప్పించి, వాటిని మళ్లీ చెక్కించి ఆ చరిత్రను ముందు తరాలకు అందించాలని పురావస్తు నిపుణులు కోరుతున్నారు.
-స్పెషల్‌ డెస్క్‌

No comments:

Post a Comment