Thursday, 26 March 2015

ధాన్యకటకం.. బౌద్ధ నిలయం అమరావతి కథలు - 2

ధాన్యకటకం.. బౌద్ధ నిలయం (26-Mar-2015)

కృష్ణా తీరాన శతాబ్దాలపాటు విలసిల్లిన బౌద్ధం
శాతవాహనుల కాలంలో మహర్దశ
కాలక్రమంలో కనుమరుగు
తూర్పు రేవు ప్రాంతాల నుంచి వచ్చే నౌకల్లోంచి నవరత్నాల మూటలు దిగుతున్నాయి! నౌకాయానం చేసే బిడారు వర్తకులు.. నది ఒడ్డున లంగరేసిన నౌకల్లోంచి సరుకులు దింపుతున్న కూలీలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. వీధివీధినా అంగళ్లు.. నవధాన్యా లూ.. రకరకాల వ్యాపారాలు చేసే వర్తక శ్రేష్టులు.. గాలి వీచినప్పుడల్లా మదిని మైమరపింపజేసే సుగంధ ద్రవ్యాల పరిమళాలు..
..కృష్ణమ్మ ఒడ్డున దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ధాన్యకటక వైభవ వర్ణన ఇది! హ్యూయాన్‌త్సాంగ్‌, ఫాహియాన్‌, మెగస్తనీస్‌, చైనా దేశపు హాన్‌ వంశ యువరాజు యాన్‌, ప్లైనీ ద ఎల్డర్‌ వంటి ఎందరో విదేశీ యాత్రికులు, చరిత్రకారులు కళ్లకు కట్టిన వైభవమిది. అందునా.. క్రీ.శ.167 నుంచి 196 దాకా ధాన్యకటకం రాజధానిగా పాలన సాగించిన చివరి శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి హయాం నిజంగా ఆ ప్రాంత ప్రజలకు, ప్రత్యేకించి బౌద్ధానికి స్వర్ణయుగమే! మగథ సామ్రాజ్య పతనానంతరం.. బౌద్ధానికి ఉత్తరాదిన ఆదరణ కరవైన వేళ దక్షిణాపథానికి తరలివచ్చిన బౌద్ధులకు తెలివాహ తీరం నుంచి కృష్ణా తీరం దాకా తెలుగు నేల జీవగడ్డగా మారిన సమయం కూడా అది. బౌద్ధం అమరావతి కేంద్రంగా కృష్ణాతీరమంతటా వ్యాపించింది. బౌద్ధులు రెండో గౌతమ బుద్ధుడుగా భావించే ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి గురువుగా వ్యవహరించేసమయంలో అత్యున్నతస్థాయిలో కాంతులీనింది. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ సమీపంలోని నాగార్జున కొండపై బయల్పడిన స్థూపాలు, చైత్యాలు, అపూర్వ శిల్పాలు.. ఇవన్నీ ఆనాటి చరిత్రకు నిదర్శనాలే. ఆచార్య నాగార్జునుడి నేతృత్వంలో విరాజిల్లిన శ్రీపర్వత మహావిశ్వవిద్యాలయంలో వేలాది విద్యార్థులు శిక్షణ పొందేవారు. అటువంటి ఆచార్యా నాగర్జునుడు సహా ఆర్యదేవుడు, భావవివేకుడు తదితర ప్రముఖ తత్వవేత్తలు అమరావతిలో బోధలు చేశారు. వారి బోధలు వినేందుకు దేశవిదేశాల నుంచి బౌద్ధమత అభిమానులు దేశవిదేశాల నుంచి తరలివచ్చేవారు. ఆ వైభవం ఎంత గొప్పగా ఉండేదంటే.. ధాన్యకటకంలో విద్యా విధానాన్ని నమూనాగా తీసుకుని టిబెట్‌లోని లాసాలో అదే రీతిలో పెద్ద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. క్రీ.పూ.6 వ శతాబ్దిలో అమరావతి ప్రాంతానికి వచ్చిన గౌతమబుద్ధుడు.. కాలచక్ర తంత్రం గురించి ఇక్కడే బోధించినట్టు చెబుతారు. భారతదేశంలో నిర్మితమైన బౌద్ధ స్తూపాలన్నింటిలోకీ అమరావతిలోని స్తూపమే పెద్దది. అయితే, క్రీ.శ.14వ శతాబ్ది తర్వాత క్రమేపీ బౌద్ధం కనుమరుగైంది. ఆ వైనం గురించి ప్రముఖ చరిత్రకారులు మల్లంపలి సోమశేఖర శర్మ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన రచనల ప్రకారం.. హ్యూయాన్‌త్సాంగ్‌ వచ్చే నాటికే అమరావతి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బౌద్ధం క్షీణ దశకు చేరుకుంటోంది. కేవలం 20 విహారాల్లో మాత్రం.. దాదాపు 1000 మంది దాకా మాత్రం బౌద్ధ భిక్షువులు ఉండేవారట. వేయి దీపాల వెలుగులతో బౌద్ధమతానికి సంబంధించిన వేడుకలు, ఉత్సవాలకు ఆలవాలమయిన మహాచైత్యం.. ఆ వెలుగులన్నీ కోల్పోయి ‘దీపాల దిన్నె’ అనే పేరును మాత్రమే మిగుల్చుకుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి ప్రాంతానికి విచ్చేసే చాలా మంది పర్యాటకులకు అలనాటి ఆనవాళ్లు శిథిల సౌఽథాలుగా కనపడతాయిగానీ.. శతాబ్దాల చరిత్రకు అవి మౌన సాక్ష్యాలు. అమరావతీ నగర ప్రభకు సిసలు చిహ్నాలు!!
-స్పెషల్‌ డెస్క్‌

No comments:

Post a Comment